ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

ఇందిరా గాంధీ తరహాలో షేక్ హసీనా హత్యకు బాడీగార్డుల కుట్ర..

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపినట్టుగానే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను బాడీగార్డులతో హత్య చేయించాలని కుట్ర పన్నినట్టు తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 31, 1984లో అప్పటి భారత ప్

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపినట్టుగానే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను బాడీగార్డులతో హత్య చేయించాలని కుట్ర పన్నినట్టు తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 31, 1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తన ఇంటి ఆవరణలోనే బాడీగార్డుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
 
ఇదేవిధంగా హసీనాను కూడా ఆమె బాడీగార్డులతో హత్య చేయాలని జిహాదీలు కుట్ర పన్నారు. నాలుగు వారాల క్రితం జరిగిన ఈ కుట్రను ప్రధాని విధేయులు, ఉగ్రవాద నిరోధక అధికారులు భగ్నం చేశారు. ప్రధాని హసీనాకు భద్రత కల్పిస్తున్న స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)కు చెందిన ఆరేడుగురు గార్డులతో ఆగస్టు 24న హత్య చేయించాలని జిహాదీలు కుట్ర పన్నినట్టు బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ పేర్కొంది. కార్యాలయం నుంచి సాయంత్రం నడకకు ఆమె బయట అడుగుపెట్టిన వెంటనే హత్య చేయాలని జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) పథకం రచించారు.
 
హసీనా హత్యకు ముందు ఆమె కార్యాలయం చుట్టూ వరుస పేలుళ్లు జరపడం ద్వారా హసీనా బాడీగార్డుల దృష్టి మళ్లిస్తారు. ఆ వెంటనే హత్యకు కుట్ర పన్నిన ఆమె బాడీగార్డులు పని పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఈ ప్లాన్‌కు సంబంధించి ఉగ్రవాదులు, ఎన్ఎస్ఎఫ్ గార్డుల మధ్య జరిగిన సంభాషణను ఇండియా, బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు వినడంతో కుట్ర భగ్నమైంది.
 
పథకం వెలుగు చూసిన వెంటనే ప్రధాని హత్య కుట్రలో భాగం పంచుకున్న బాడీగార్డులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, జనవరి 2009లో షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 11సార్లు ఆమెపై హత్యాయత్నాలు జరిగాయి.