బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (11:55 IST)

కరాచీ విమానాశ్రయంలో భారీ పేలుడు.. ఇద్దరు చైనీయులు మృతి

kerala blast
పాకిస్థాన్ దేశంలోని అతిపెద్ద విమానాశ్రయమైన కరాచీ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. క్షతగాత్రులు అందరినీ అత్యవసర చికిత్స కోసం సమీపంలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 
కాగా, భారీ పేలుడు తర్వాత మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లను చుట్టుముట్టాయి. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఆ ప్రదేశంలో భారీ సైనిక బలగాలు మోహరించి ఉండడంతో వెంటనే ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి.
 
ఈ దాడినికి సింధ్ రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఖండించారు. విదేశీయులపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. పేలుడు చాలా పెద్దది కావడంతో విమానాశ్రయ భవనాలు కంపించాయని పాకిస్థాన్ పౌర విమానయాన శాఖ అధికారి రాహత్ హుస్సేన్ వెల్లడించారు. సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరారని పోలీసులు తెలిపారు.
 
మరోవైపు, కరాచీ విమానాశ్రయంలో పేలుడుకు వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నైతిక బాధ్యత వహించింది. ఈ మేరకు ఒక ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేసింది. చైనా జాతీయులు లక్ష్యంగా వాహనంలో పేలుడు పరికరాన్ని అమర్చామని, ఈ పేలుడు తామే చేశామని బీఎల్ఏ పేర్కొంది. ఈ పేలుడుపై చైనా ప్రభుత్వం స్పందించారు. ఈ దశ్చర్యను ఖండిస్తున్నట్టు పేర్కొంది.