బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (22:00 IST)

చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో విషాదం.. తొక్కిసలాట.. నలుగురి మృతి

airshow
చెన్నై మహానగరంలోని మెరీనా బీచ్‌లో ఆదివారం ఎయిర్ షో జరిగింది. భారత వైమానిక దళం, భారత నావికా దళం సంయుక్తంగా ఈ ఎయిర్‌షోను నిర్వహించాయి. అయితే, ఈ షో ముగిసిన తర్వాత విషాదం చోటుచేసుకుంది. ఈ ఎయిర్‌షోను తిలకించేందుకు లక్షలాది మంది నగర వాసులు తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడటంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. 
 
ఒకవైపు ఉక్కపోత, ఎండవేడిమి తాళలేక ముగ్గురు సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని మూడు ప్రధాన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు శ్రీనివాసన్‌, కార్తికేయన్‌, జాన్‌బాబు, దినేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఎయిర్‌ షోకు దాదాపు 13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు అంచనా.
 
మధ్యాహ్నం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ప్రదర్శన జరిగింది. అయితే, ఆ తర్వాత ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. ఇది ఆదివారం సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకూ ఇబ్బంది ఎదురైంది. 
 
చెన్నైనుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడంతో.. మెరీనా బీచ్‌ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో.. ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకూ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అన్నా సమాధి వద్ద బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు.