శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..
లడ్డూ ప్రసాదాల తయారీ కోసం ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి వచ్చిన ఎనిమిది ట్యాంకర్ల కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన డెయిరీ నుంచి సరఫరా కాలేదని, ఆ కంపెనీకి సరఫరా కాంట్రాక్టు లభించిందని ఓ డాక్యుమెంట్ ద్వారా వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల ప్రకారం మొత్తం ఎనిమిది ట్రక్కులు ఎ.ఆర్. డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు వారి డెయిరీలో తయారు కాలేదు. ఇ-ఇన్‌వాయిస్‌లు, ఇ-వే బిల్లులు, ట్యాంకర్ రవాణా పత్రాల ఆధారంగా, మొత్తం ఎనిమిది వాహనాలు తిరుపతిలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సప్లై అయ్యాయి
ఈ వాహనాలు డిండిగల్‌కు వెళ్లి టిటిడికి రౌండ్ ట్రిప్ చేసినట్లు డిపార్ట్‌మెంట్ గుర్తించింది. నెయ్యి వ్యాపారానికి అనుమతి లేనందున ఇది టెండర్ నిబంధనలను ఉల్లంఘించింది. వైష్ణవి నుంచి ఏఆర్ డైరీ వరకు ఉన్న వాహనాలనే టీటీడీకి మళ్లించినట్లు ఈ-ఇన్‌వాయిస్‌లు సూచిస్తున్నాయి.
వైష్ణవి డెయిరీ కూడా ఈ నెయ్యిని తయారు చేయలేదని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ఇది ఉత్తరాఖండ్‌లోని భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి దీన్ని సేకరించారు. భోలే బాబా మొత్తం ఎనిమిది ట్రక్కుల నెయ్యిని వైష్ణవికి కిలో రూ. 412, 403 చొప్పున విక్రయించారు. వైష్ణవి నెయ్యిని కల్తీ చేసి ఎ.ఆర్.కి సరఫరా చేసిందని ఆరోపణలు వున్నాయి. ఈ ఏఆర్ డెయిరీ కిలో రూ.318.57లకు అదే నెయ్యిని కిలో రూ.319కి టీటీడీకి సరఫరా చేసింది.