శుక్రవారం, 27 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2024 (22:31 IST)

కల్తీ నెయ్యి వివాదం: ‘ఎస్ వాల్యూ’ అంటే ఏమిటి? ఏది స్వచ్ఛమైన నెయ్యి, ఏది కల్తీ నెయ్యి.. గుర్తించడం ఎలా?

Laddu
తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతలేని నెయ్యితో తయారు చేస్తున్నారంటూ చెలరేగిన వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఎన్.డి.డి.బి ఇచ్చిన రిపోర్టులో ఎస్ వాల్యూలో తేడాలు ఉండటంతోనే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై అనుమానాలు వచ్చాయంటూ ఏపీ ప్రభుత్వం చెప్పింది. అసలు ఇంతకీ ఎస్ వాల్యూ అంటే ఏమిటి? ఎన్.డి.డి.బి రిపోర్టులో ఇంకా ఏ అంశాలున్నాయి అనే అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేసే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Food Safety and Standards Authority of India) డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులతో ( వీరు పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు) బీబీసీ మాట్లాడింది. వారు చెప్పిన వివరాల మేరకు...
 
ఎస్-వాల్యూ అంటే...
నెయ్యిలోని కొవ్వు నాణ్యతని గుర్తించేందుకు చేసే రసాయన పరీక్షే ఎస్-వాల్యూ. ఇందులో ఎస్ అంటే స్టాండర్డ్ అని అర్థం. ఐఎస్ఓ నిబంధనల ప్రకారం గేదె పాలతో చేసిన నెయ్యికి, ఆవు పాలతో చేసిన నెయ్యికి వేరువేరు ఎస్-వాల్యూలు ఉంటాయి. కాబట్టి ఈ రెండిటికి ఒకే విధమైన సమీకరణాలతో ఎస్-వాల్యూని లెక్కించకూడదు. గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (జీఎల్సీ) పరికరంతో స్వచ్ఛమైన ఆవు, గేదె నెయ్యిల నాణ్యతని కచ్చితంగా నిర్ణయించవచ్చు. కూరగాయల నూనెలు, జంతు కొవ్వులు, ఖనిజాల నూనెలు వంటి కల్తీలను గుర్తించడానికి ఇది అత్యంత కచ్చితమైన పద్ధతి. స్వచ్ఛమైన నెయ్యిలోని కొవ్వుల శాతం 98.05-104.32 మధ్య ఉంటే...అది ఎస్-వాల్యూకి అనుగుణంగా ఉందని అర్థం.
 
ఒక వేళ ఆ నిర్ణీత పరిధిలో ఏ చిన్న తేడా వచ్చినా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎస్-వాల్యూని నెయ్యిలో కొవ్వుశాతాన్ని కొలిచేందుకు స్టాండర్డ్ వాల్యూగా నిర్ణయించారు. ఎస్-వాల్యూని ఐదు రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో ఒక్కొ రకం ఒక్కో రకమైన కల్తీని తెలుపుతుంది.
ఈ పరీక్షలన్నీ ఐఎస్ఓ 17678:2010 ప్రకారం జరుపుతారు.
 
* ఎస్-వాల్యూ 98.05-104.32 మధ్య ఉంటుంది. దీనిని టోటల్ ఎస్-వాల్యూ అంటారు.
* ఎస్2-వాల్యూ 98.05- 101.95 మధ్య ఉంటుంది. ఈ పరిధిలో ఎస్-వాల్యూ రాకపోతే అందులో సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆవగింజలు, గోధుమపిండి, మొక్కజొన్నపిండి, పత్తి, చేప నూనెలతో నెయ్యి కల్తీ జరిగిందని అర్థం చేసుకోవచ్చు.
* ఎస్3-వాల్యూ 99.42 – 100.58 మధ్య ఉంటుంది. నెయ్యి పరీక్షలో ఈ విలువ ఎక్కువ ఉంటే అందులో కొబ్బరి లేదా పామ్ కార్నల్ ఫ్యాట్ (పామ్ గింజల నుంచి ఉత్పత్తయ్యే కొవ్వు) కలిసినట్లే.
* ఎస్3-వాల్యూ 95.90 – 104.10 ఉంటుంది. ఆ విలువకు ఎక్కువున్నా, తక్కువున్నా నెయ్యిలో పామాయిల్ (పామ్ పళ్ల నుంచి ఉత్పత్తయ్యే నూనె) ఉన్నట్లు లెక్క.
* ఎస్ 5-వాల్యూ 97.96 – 102.04 మధ్య కాకుండా ఎక్కువ ఉన్నా, తక్కువవున్నా, అందులో లాడ్(పందికొవ్వు) కలిసినట్టే.
 
నాణ్యత నిర్థరణ కోసం ...
నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని మరిన్ని పరీక్షలతోనూ నిర్ణయించవచ్చు.
అయితే ఇవన్నీ ప్రయోగశాలలో చేయాల్సినవే.
 
మొత్తం 50 నుంచి 55 పరీక్షల ద్వారా నెయ్యి నాణ్యత, లేదా అందులో ఏదైనా కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యంగా గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పరీక్ష నెయ్యిలో కల్తీ జరిగిందా? లేదా? అనే అంశాల కచ్చితమైన నిర్థరణకు ఉపకరిస్తుంది. నెయ్యి నాణ్యత విషయంలో ఎన్.డి.డి.బి రిపోర్టులో ఉన్న ముఖ్యమైన కొన్ని పరీక్షలు తెలుసుకుందాం.
 
బౌడౌయిన్ పరీక్ష (Baudouin test): ఈ పరీక్షను నెయ్యిలో నువ్వుల నూనె కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకునేందుకు చేస్తారు.
రైచర్ట్-మెయిస్సెల్ విలువ (RM Value): అస్థిర కొవ్వు ఆమ్లాలను (acetic acid, propionic acid, butyric acid, valeric acid, caproic acid) కొలుస్తుంది.
పాలలో కొవ్వు (Milk fat): పాలలో ఉన్న కొవ్వు శాతాన్ని నిర్ణయిస్తుంది.
అయోడిన్ టెస్ట్ (Iodine test): కరిగించిన నెయ్యికి కొన్ని చుక్కల అయోడిన్ కలిపినప్పుడు అది బ్లూ లేదా పర్పుల్ రంగులోకి మారితే అది కల్తీ నెయ్యి అని అర్థం. అందులో స్టార్చ్ కలిపినట్లు నిర్థరణకు రావొచ్చు. స్వచ్ఛమైన నెయ్యి అయోడిన్‌తో చర్య జరపదు.
 
సపోనిఫికేషన్ వాల్యూ (Saponification Value): సపోనిఫికేషన్ వాల్యూని తెలుసుకోవడం ద్వారా సబ్బుల తరహా గట్టిదనంలాంటి లక్షణం నెయ్యిలో ఉందో లేదో నిర్ణయిస్తారు.
 
కల్తీ నెయ్యిని గుర్తించడమెలా?
స్వచ్ఛమైన నెయ్యి : గేదెలు, ఆవుల నుంచి సేకరించిన పాలతో చేసినది
కల్తీ నెయ్యి : కూరగాయల (సోయాబీన్, పామాయిల్, సన్ ప్లవర్) నూనెతో చేసినది.
జంతు కొవ్వులు లేదా రంగు, రుచి కోసం కలిపే సింథటిక్ పదార్థాలు కలిపి చేసినవి.
స్వచ్ఛమైన నెయ్యిని పాల నుంచి వెన్నని వేరు చేసి తయారు చేస్తారు.
కూరగాయల నూనెలు, జంతు కొవ్వులతో పాటు కృతిమ రంగులు, నిల్వ కోసం రసాయనాలు కలిపి తయారు చేసేది కల్తీ నెయ్యి.
 
స్వచ్ఛమైన నెయ్యి రంగు : గోల్డెన్ ఎల్లో టూ లైట్ బ్రౌన్
కల్తీ నెయ్యి రంగు: పాలిపోయినట్టు లేదా అసలైన నెయ్యి రంగు కంటే చిక్కని రంగులో ఉంటుంది.
స్వచ్ఛమైన నెయ్యి వాసన: ముతకబియ్యం, పంచదార పాకం లాంటి వాసన వస్తుంది.
కల్తీ నెయ్యి వాసన: మనకు తెలియని కృత్రిమమైన వాసన వస్తుంది.
స్వచ్ఛమైన నెయ్యి రుచి : పాలమీగడతో చేసిన మిఠాయిలా అనిపిస్తుంది
కల్తీ నెయ్యి రుచి : చేదుగా ఉండి కాస్త కుళ్లిన పదార్థం లేదా గ్రీస్ తిన్నట్లు అనిపిస్తుంది.
స్వచ్ఛమైన నెయ్యి స్పర్శ : చేతితో తాకితే నునుపుగా, ముద్దగా ఉంటుంది.
కల్తీనెయ్యి స్పర్శ : నూనెలను తాకినట్లు అనిపిస్తుంది.
స్వచ్ఛమైన నెయ్యి జీవితకాలం : 6 నెలలు (తక్కువ తేమ కారణంగా)
కల్తీనెయ్యి జీవితకాలం : 3 నెలలు (ఎక్కువ తేమ వలన)
స్వచ్ఛమైన నెయ్యి పౌష్టిక విలువలు : ఏ,డీ,ఈ,కే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
కల్తీనెయ్యి పౌష్టిక విలువలు: పౌష్టిక విలువలు ఉండకపోగా...రసాయనాలు కలపడం వలన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది.
 
ఇంటి వద్దే కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలంటే...
నెయ్యి వాడే కుటుంబాలు భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి.
1. నెయ్యిని గిన్నెలో వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారితే అది కల్తీ నెయ్యే
2. అరచేతిలో కొద్దిగా నెయ్యిని వేస్తే అది కరుగుతున్నా, లేదా దాని నుంచి ఎటువంటి సువాసన రాకపోయినా అది కల్తీ నెయ్యి కిందే లెక్క.
3. తెల్ల కాగితంపై కొద్దిగా నెయ్యి వేసిన ఒకటి, రెండు గంటల తర్వాత దానిపై మలినాలు ఏర్పడితే అది కల్తీ నెయ్యే.
4. స్వచ్ఛమైన నెయ్యి మృదువుగా ఉంటుంది.
5. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో స్వచ్ఛమైన నెయ్యి వేస్తే అది కరిగిపోతుంది. అలా కాకుండా నెయ్యి తేలినా, గడ్డకట్టినా అది కల్తీ నెయ్యిగానే భావించాలి.
6. కల్తీ నెయ్యి రుచికి చేదుగా ఉంటుంది. కల్తీ నెయ్యిని ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డకట్టదు.
 
నెయ్యిని అనేక రకాలుగా కల్తీ చేసే అవకాశం ఉంది. అలాంటి కల్తీ నెయ్యిని వివిధ రూపాల్లో ఎక్కువ సార్లు తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారలోపం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. కల్తీ నెయ్యి వాడకం వలన అలర్జీలు ఎక్కువగా వస్తాయి.