శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:50 IST)

కజకిస్థాన్‌లో కూలిన విమానం... 14 మంది మృతి

కజకిస్థాన్‌ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అల్‌మటీ నగరంలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన బెక్‌ ఎయిర్‌కు చెందిన విమానం టేకాఫ్‌ అయిన కొద్దసేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100మంది ఉన్నారు. వీరిలో 95మంది ప్రయాణికులు కాగా.. ఐదుగురు సిబ్బంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 
 
మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని రెండస్థుల భవనాన్ని విమానం ఢీకొట్టిందని స్థానిక మంత్రి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
 
విమానం ఆల్‌మటీ ఎయిర్‌పోర్టు నుంచి కజకిస్థాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌కు బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ధారించారు. విమానం కుప్పకూలిన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. 
 
ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ప్రమాదంపై కజకిస్థాన్‌ ప్రెసిడెంట్‌ క్యాసమ్‌ జోమార్ట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రెసిడెంట్‌ ప్రార్థించారు.