బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:18 IST)

కిమ్ సర్కారు ఘాతుకం.. దక్షిణ కొరియా అధికారిని చంపడమే కాకుండా నిప్పంటించి..?

ఉత్తర కొరియాలోని కిమ్ జాంగ్ సర్కారు మరో ఘాతుకానికి పాల్పడింది. తమ దేశానికి చెందిన ఒక అధికారిని ఉత్తర కొరియా బలగాలు కాల్చి చంపాయని దక్షిణ కొరియా తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర జలాల బోర్డర్ పరిధిలో నీటిలో తేలుతున్న చిన్నపడవపై కాల్చేసిన తమ అధికారి శవం ఉన్నట్టు దక్షిణ కొరియా ప్రభుత్వం గుర్తించింది. సరిహద్దుకు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో అనధికార చేపల వేటను నియంత్రించడానికి పంపిన బృందంలోని ఆ అధికారి అనుకోని రీతిలో ప్రభుత్వ ఓడ నుంచి అదృశ్యమయ్యాడని తెలుస్తోంది.
 
మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కొరియా అధికారి వెళ్లిన ప్రాంతానికి గ్యాస్ మాస్కులు ధరించిన తమ అధికారులను ఉత్తర కొరియా పంపింది. చంపిన తరువాత బాధితుడి శరీరంపై గ్యాసోలిన్ పోసి నిప్పంటించారని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
చనిపోయిన అధికారి ఉత్తరం వైపు వెళ్లడానికి ఎందుకు ప్రయత్నించాడనేది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడు అక్రమంగా ఉత్తర కొరియాలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అతడు లైఫ్ జాకెట్ ధరించి, ఒక చిన్న పడవపై ప్రయాణిస్తుండగా ఉత్తర కొరియా నేవీ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారని పేరు వెల్లడించని దక్షిణ కొరియా అధికారి ఒకరు చెప్పారు.  
 
తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కానీ ఈ వాదనను విదేశీ నిపుణులు ఖండిస్తున్నారు. ఆ దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండదు. దీనికి తోడు వైద్య సామగ్రి కొరత కూడా ఉంటుంది. దీంతో అక్కడ కరోనా మహమ్మారి వ్యాపిస్తే, దాని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా వచ్చిన వారిని కాల్చి చంపాలని ఉత్తర కొరియా అధికారులను కిమ్ ఆదేశించాడు. ఇందులో భాగంగానే అక్రమంగా సరిహద్దులు దాటి రావాలనుకున్న బాధితుడిని సైతం కాల్చి నిప్పంటించినట్టు తెలుస్తోంది.
 
తప్పిపోయిన అధికారి సమాచారం గురించి బుధవారం దక్షిణ కొరియా దాయాది దేశాన్ని సంప్రదించింది. అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే యూఎన్ కమాండ్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఉత్తర కొరియాకు సందేశం పంపింది. కానీ ఆ దేశం స్పందించలేదని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.