మయన్మార్ గనిలో ప్రమాదం.. 162కి చేరిన మృతుల సంఖ్య (Video)
మయన్మార్ కచిన్ రాష్ట్రంలో హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి గనిలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 162కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ గనిని తవ్వి తీసిన మట్టి పక్కనపోస్తుంటారు. అయితే, ఈ గనిలో పనిచేస్తున్న కార్మికులు అక్కడే తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు.
గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పక్కన పోసిన మట్టి.. కార్మికుల షెల్టర్లపై పడటంతో పలువురు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది ఇప్పటికే మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ 162 మృతదేహాలు వెలికితీశారు.
మట్టి దిబ్బల కింద మరికొంత మంది సజీవ సమాధి అయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 2015లో కూడా ఇలాంటి ఘటన ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్పటి సమాచారం ప్రకారం 113 మంది మృతి చెందారు.