శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (12:39 IST)

పార్లమెంట్ వేదికగా ముష్టిఘాతాలు కురిపించుకున్న ఎంపీలు!!

italy parliament
పార్లమెంట్ వేదికగా ఎంపీలు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ షాకింగ్ ఘటనకు ఇటలీ పార్లమెంట్ ఘటన వేదికగా నిలిచింది. ఓ బిల్లును ఆమోదించుకునే విషయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగి, చివరకు ముష్టిఘాతాలతో ముగిశాయి. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. 
 
ఈ క్రమంలో సెంటర్ - లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంట్‌లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర - దక్షిణ విభజనలు మరింత తీవ్రమవుతుందని, పేదరింలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు గట్టిగా వాదిస్తున్నారు.