బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (19:35 IST)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

miss universe
ప్రపంచ స్థాయిలో నిర్వహించే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 2024 సంవత్సరానికిగాను మిస్ యూనివర్స్‌ టైటిల్‌ (విశ్వ సుందరి)ను డెన్నార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్‌ గెలుచుకున్నారు. దీంతో ఆమెకు విశ్వసుందరి కిరీట ధారణ చేసారు. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 125 మంది పోటీపడ్డారు. వీరిలో 21 ఏళ్ల విక్టోరియా కెజార్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్టినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్టాన్ మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. ఈ మేరకు షెన్నిస్ పలాసియోస్ (మిస్ యూనివర్స్ 2023) విజేతకు కిరీటాన్ని అందజేశారు. 'కొత్త శకం మొదలైంది. 73వ విశ్వ సుందరిగా గెలుపొందినందుకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాం' అని మిస్ యూనివర్స్ టీమ్ పేర్కొంది. ఆమెకు ఫ్యాషన్ ప్రియులు అభినందనలు తెలిపారు. మరోవైపు, ఈ పోటీల్లో భారత్ తరఫున రియా సింఘా పాల్గొన్నారు. టాప్ 5లోనూ ఆమె నిలవలేక పోయారు. ఈమెకు 12వ స్థానం దక్కింది. 
 
కాగా, విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. 2004లో సోబోర్గ్ జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొందారు. వ్యాపారవేత్తగా మారారు. డ్యాన్సులోనూ శిక్షణ తీసుకున్నారు. మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ వంటి విషయాలపై పోరాటం చేస్తున్నారు. 
 
అందాల పోటీల్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్‌కి వచ్చారు. మిస్ డెన్మార్క్ తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి.. అందరి దృష్టిలో పడ్డారు.