శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:50 IST)

మలేరియా మందు కరోనాకు వాడకూడదు.. అధిక మరణాలు తప్పవట..

భారత్ నుంచి తెప్పించుకున్న మలేరియా మందు.. అమెరికాకు పనిచేసేలా లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి ఈ మందును తెప్పించేందుకు ప్రతీకారం వరకు వెళ్లారు. ఆ మందు పేరు హైడ్రాక్సీక్లోరోక్విన్. అది మలేరియా మందు. దానిని అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్‌తో కలిపి వాడితే కరోనాకు చెక్ పెట్టవచ్చునని అనుకున్నారు. కానీ కరోనా రోగం కుదరడం మాటేమోగానీ కథ అడ్డం తిరిగింది. 
 
అమెరికా అంటువ్యాధుల విభాగం నియమించిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ వాడరాదని సిఫారసు చేసింది. ఔషధ పరీక్షలకు తప్ప మరి దేనికీ దీనిని వాడొద్దని స్పష్టం చేసింది. కానీ హైడ్రాక్సీక్లోరోక్విన్ లేదా మరో క్లోరోక్విన్ వాడకం గురించి ఏమీ చేల్చలేదు. అనుకూలంగా లేదా వ్యతిరేకంగా చెప్పడానికి తగినంత సమాచారం లేదని కమిటీ పేర్కొన్నది. ఒకవేళ ఆ మందు వేసేటట్టయితే ప్రతికూల ప్రభావాల కోసం పేషంటును పరిశీలించాలని నొక్కిచెప్పింది. 
 
ఈ కమిటీని అమెరికా అధ్యక్షుని సలహాదారైన ఆంటోనీ ఫాసీ నియమించారు. కాగా మంగళవారం ప్రచురితమైన ఓ విశ్లేషణ నివేదిక అమెరికా వెటరన్ అఫేర్స్ హాస్పిటల్స్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు లేకపోగా అధిక మరణాలు సంభవించాయని హెచ్చరించడం గమనార్హం. కానీ దీనిపై లోతైన పరిశోధన జరగాల్సి వుంది.