శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:41 IST)

శ్మశానానికి వైద్యుడి మృతదేహం.. రాళ్లతో కొట్టారు... చివరికి.. అర్థరాత్రి పూట?

తమిళనాడులో కరోనాతో మరణించిన ఓ ఆంధ్రప్రదేశ్‌ వైద్యుని మృతదేహాన్ని చెన్నైలోని శ్మశాన వాటికలోకి స్థానికులు అనుమతించని సంగతి తెలిసిందే. సోమవారం నాటికి తమిళనాడులో నమోదైన 43 కేసులతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1520కి చేరుకుంది.

తాజాగా ఓ వైద్యుడి మరణంతో మృతిచెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. కరోనా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగికి అంతిమ సంస్కారం నిర్వహించేందుకు ప్రయత్నించిన తమిళనాడు వైద్యుడికి చేదు అనుభవం ఎదురైంది. బాధితులకు చికిత్స చేస్తూ చనిపోయిన వైద్యుని అంత్యక్రియల నిర్వహణకు కొందరి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన ఓ న్యూరో సర్జన్‌ (55), కొవిడ్‌-19 సోకటంతో ఈ ఆదివారం మరణించారు. తను చికిత్స చేసిన ఓ కరోనా వైరస్‌ బాధితుడి నుంచే ఆయనకు ఈ వ్యాధి సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించటానికి డాక్టర్‌ కె.ప్రదీప్‌ కుమార్‌ అనే మరో వైద్యుడు ఏర్పాట్లు చేశారు.

కొందరు ప్రభుత్వాధికారులు, అంబులెన్స్‌ డ్రైవర్‌లతో సహా ఆయన శ్మశానం వాటికను చేరుకున్నారు. అయితే అంత్యక్రియలను నిర్వహించటం వల్ల తమ ప్రాంతంలో కరోనా వ్యాప్తిస్తుందంటూ అంబులెస్స్‌ను అడ్డగించిన ఓ గుంపు... వారిపైకి ఇటుకలు, రాళ్లు, సీసాలు, కర్రలతో దాడిచేసి ఆ ప్రదేశం నుంచి తరిమివేశారు. 
 
అనంతరం వారు మరో శ్మశాన వాటికను చేరుకోగా... అక్కడ కూడా ఇదే విధంగా పునరావృతమైంది. ఈ దాడుల్లో అంబులెన్స్‌ అద్దాలు పగిలిపోవటంతో పాటు శవపేటిక కూడా దెబ్బతింది.

ఇద్దరు పారిశుద్ధ్య అధికారులతో సహా మృతదేహాన్ని క్రిందికి దించబోయిన డ్రైవర్, సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు. మరో ముగ్గురు సిబ్బందికి కూడా దెబ్బలు తగిలాయి. చివరికి 1.30గంటలకు ఆ దేహాన్ని ఓ వార్డు బాయ్, పోలీస్ అధికారి సాయంతో పూడ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనలో పోలీసులు 21 మందిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ విధమైన ఘటనలు పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. వారికి సరైన రక్షణను కల్పించి ఉండాల్సిందని తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం అభిప్రాయపడింది.
 
కరోనా నివారణకు అంకితమై తమ ప్రాణాలకు కోల్పోయిన వైద్యుని పట్ల ఈ విధమైన అసాంఘిక, అనాగరిక ప్రవర్తన చాలా విచారకరమని... ఇటువంటి సంఘటనలను నియంత్రించలేకపోతే ప్రభుత్వాలు పాలించే నైతిక హక్కును కోల్పోతాయని వైద్యుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మద్రాసు హైకోర్టు ఈ ఘటనపై వివరణ కోరుతూ తమిళనాడు ప్రబుత్వానికి ఓ నోటీసు జారీ చేసింది.