నైజీరియాలో ఘోర ప్రమాదం: 150మందికి పైగా ప్రయాణీకుల గల్లంతు
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి కంటే ఎక్కువ మంది పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 150 మందికి పైగా ప్రయాణీకులు గల్లంతయ్యారు.
వివరాల్లోకి వెళితే.. నైజీరియా దేశంలోని సెంట్రల్ నైజర్ రాష్ట్రం నుంచి వాయువ్య కెబ్బి రాష్ట్రానికి 180 మంది ప్రయాణీకులతో ఓ పడవ బయలుదేరిందని నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ స్థానిక మేనేజర్ యూసుఫ్ బిర్మా తెలిపారు. ఆ పడవ సామర్ధ్యానికి మించి అధిక సంఖ్యలో ప్రయాణిస్తుండడంతో పడవ మునిగిపోయింది.
ఈ ఘటనలో 22 మందిని రక్షించామని, నలుగురు మరణించారని చెప్పారు. సుమారు 150 మంది గల్లంతయ్యారని గాస్కి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అబ్దుల్లాహి బుహారి వారా తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
అయితే.. వారంతా నీటిలో మునిగిపోయినట్లుగా భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. నైజీరియా దేశంలోని ఇలాంటి పడవ ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. నదిలో ప్రమాదానికి గురైన పడవ పాతదని.. ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించారని బిర్మా తెలిపారు.