శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (10:49 IST)

నన్ను భారత్‌కు పంపించకండి.. బ్రిటన్ హైకోర్టులో పిటీషన్.. నీరవ్ మోదీ

వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడి, దేశం విడిచి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. మరోసారి వార్తల్లోకెక్కారు. తనను భారత్‌కు పంపించడానికి అనుకూలంగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని సవాల్ చేశారు. బ్రిటన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
పౌరసత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తనను భారత్‌కు పంపించడానికి వీలుగా ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఇటీవలే అనుమతి ఇచ్చిన ప్రతిపాదనలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.
 
తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా ఆదేశాలను జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. కేసులు నమోదైన వెంటనే ఆయన దేశం విడిచి పారిపోయారు. 
 
బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై కేసు నమోదు చేశాయి. విచారణ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు బ్రిటన్ పోలీసులు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకున్నారు.
 
బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విచారణలో భాగంగా నీరవ్ మోడీని స్వదేశానికి రప్పించడానికి సీబీఐ అధికారులు తరచూ సంప్రదింపులను చేస్తోన్నారు. ఈ క్రమంలో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్ న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చింది. 
 
దీనికి అనుగుణంగా ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ కిందటి నెల ఆమోద ముద్ర వేసింది.
 
తాజాగా నీరవ్ మోడీ దీనిపై అప్పీల్‌కు వెళ్లారు. బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ తనను భారత్‌కు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ అప్పీల్ చేశారు. తన మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను రూపొందించిందని పేర్కొన్నారు. స్వదేశానికి అప్పగించాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలను ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.