సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (17:37 IST)

ఇప్పటికిప్పుడు మధ్యంతర బెయిల్ ఎలా ఇవ్వగలం : బాంబే హైకోర్టు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టు కూడా షాకిచ్చింది. ఇప్పటికిపుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. 
 
తన అరెస్టు అక్రమమని, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. అయితే, కేసు పూర్వాపరాలను విచారించకుండా ఇప్పటికిప్పుడు మధ్యంతర బెయిల్‌ను ఇవ్వలేమని పేర్కొంది.
 
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అర్నాబ్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అర్నాబ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 
 
వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్ భార్య అక్షతలను తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
 
ఆర్కిటెక్చర్ - ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్య కేసును బాధిత కుటుంబం అభ్యర్థనపై తిరిగి ఓపెన్ చేసిన ప్రభుత్వం అర్నాబ్ గోస్వామి, ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను అరెస్ట్ చేసి అలీబాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. అర్నాబ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు, 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.