మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (17:50 IST)

రియాకు ఇప్పట్లో బెయిల్ ఇవ్వలేం : బాంబే హైకోర్టు

డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టు అయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ఇప్పట్లో బెయిల్ ఇవ్వలేమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో రియాకు డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బైకుల్లా జైలులో ఉంది.
 
అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లను కింది కోర్టులు కొట్టివేశాయి. ఇపుడు హైకోర్టు కూడా రియా బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇపుడు రియాకు బెయిల్ మంజూరు చేస్తే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఆమె ఎవరి పేర్లను వెల్లడించిందో... వారందరినీ అలర్ట్ చేస్తుందని కోర్టు తెలిపింది. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో రియా కొందరి పేర్లను వెల్లడించిందని తెలిపింది. రియా బయటపెట్టిన వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతోందని... ఈ నేపథ్యంలో రియా విడుదలైతే అందరూ కలిసి సాక్ష్యాలను నాశనం చేస్తారని చెప్పింది. సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఇప్పుడు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితురాలికి తాను బెయిల్ ఇవ్వలేనని జడ్జి తెలిపారు.