మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:03 IST)

రియా లీక్ చేసిన డ్రగ్స్ దందా? సెలెబ్రిటీల వెన్నులో వణుకు!!

మాదకద్రవ్య వ్యాపారులతో సంబంధాలు కలిగివున్నాయన్న కారణంగా బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (మాదకద్రవ్య నిరోధక విభాగం) అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు ముందు ఆమె వద్ద పలు దఫాలుగా విచారణ జరిపింది. ఈ విచారణలో అనేక విషయాలను ఆమె పూసగుచ్చినట్టు వివరించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, డ్రగ్స్ తీసుకునే సెలెబ్రిటీల పేర్లతో పాటు.. డ్రగ్స్ సరఫరా చేసే వారి పేర్లను కూడా ఆమె ఎన్.పి.బికి తెలిపినట్టు తెలుస్తోంది. ఒక్క రియా మాత్రమే కాదు, ఇదే కేసులో అరెస్టు అయిన రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, బాలీవుడ్ హీరో సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరాండాలు కూడా పూర్తి వివరాలు చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ బాలీవుడ్ సెలెబ్రిటీలందరికీ వచ్చే రెండు వారాల వ్యవధిలో సమన్లు జారీ చేసి విచారించాలని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఇటీవలి బాలీవుడ్ పార్టీలు, అందులో పాల్గొని డ్రగ్స్ తీసుకున్న వారిలో తనకు తెలిసిన పేర్లను రియా విచారణలో చెప్పిందని, మాదకద్రవ్యాలు, మత్తు మందులను సినీ తారలకు అందిస్తున్న వారి జాబితాను కూడా పేర్కొందని టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. రియా వెల్లడించిన సెలబ్రిటీల జాబితా తమకు అందిందని, వచ్చే పది రోజుల్లో వారికి నోటీసులు జారీ కానున్నాయని జాతీయ మీడియా కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. దీంతో డ్రగ్స్ తీసుకునే సెలెబ్రిటీలతో పాటు.. వారికి సరఫరా చేసిన వారి వెన్నులో వణుకు మొదలైందని చెప్పొచ్చు.