గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (19:49 IST)

రియా డబ్బు కోసం మగాళ్ళతో తిరిగే మహిళే కావొచ్చు... ఆ మాస్టర్ మైడ్స్ పేర్లు వెల్లడించాలి...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేసింది. రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అరెస్టు చేసింది. దీనిపై కంగనా స్పందిస్తూ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియాను బలిపశువును చేస్తారనే విషయాన్ని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని, అది ఇపుడు నిరూపితమైందన్నారు. 
 
ముఖ్యంగా రియా డబ్బు కోసం మగాళ్లతో స్నేహం చేసే మహిళే కావచ్చు... ఆమె డ్రగ్స్ తీసుకునే ఉండొచ్చు... కానీ, విచారణలో అన్ని విషయాలను నిర్భయంగా బయటపెట్టాలని వ్యాఖ్యానించింది. సుశాంత్ మరణం వెనుకున్న మాస్టర్ మైండ్స్ పేర్లను ఆమె వెల్లడించాలని కంగన చెప్పింది. సుశాంత్ సినిమాలను లాక్కున్న వ్యక్తులు ఎవరు? అతనికి డ్రగ్స్ ఇచ్చింది ఎవరు? అతని కెరీర్‌ను నాశనం చేయాలని అనుకున్నది ఎవరు? అనే విషయాలను రియా బయటపెట్టాలని కంగనా కోరింది. 
 
సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం ఉందన్న విషయం తెల్సిందే. దీంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతోంది. తాజాగా ఎన్సీబీ అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రియాను ఎన్సీబీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు.
 
ఈ విచారణలో తాను సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా అంగీకరించింది. ఆమె నుంచి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ... మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆమెను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో ఎన్సీబీ వేగం పెంచడం చూస్తుంటే సుశాంత్ మరణంలో డ్రగ్స్ వ్యవహారమే కేంద్రబిందువుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.
 
కాగా, రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలో ఉంది. ఆమెను మంగళవారం రెండు దఫాలుగా విచారించిన ఎన్సీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. రియాను ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపించడంలేదు. రియాకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించాలని నార్కొటిక్స్ అధికారులు భావిస్తున్నారు.