కంగనాను టార్గెట్ చేసిన శివసేన : మణికర్ణిక ఆఫీస్ కూల్చివేతకు నోటీస్!

kangana
ఠాగూర్| Last Updated: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (18:02 IST)
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌ను శివసేన టార్గెట్ చేసినట్టుగా వుంది. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చుతూ కంగనా ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు కంగనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

సుశాంత్ కేసులో న్యాయం జరగాలని, ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐకి సుశాంత్ కేసును అప్పగించాలని గతంలో కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఇక్కడ నుంచి వారిద్దరి మధ్య చిచ్చురేగింది.

ఈ క్రమంలో ముంబైలో అడుగుపెడితే దాడి చేస్తామని శివసేన హెచ్చరిక చేస్తే.. ఈ నెల 9వ తేదీన ముంబైకు వస్తున్నానని, ఫ్లైట్ ల్యాండయ్యే సమయం తర్వాత చెబుతానని, దమ్మున్న వ్యక్తి వచ్చి అడ్డుకోవాలంటూ కంగనా బహిరంగ సవాల్ విసిరింది. దీంతో కంగనా వర్సెస్ శివసేనగా మారిపోయింది.

ఈ క్రమంలో కంగనాకు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. ఆమెకు చెందిన పాళి హిల్ బంగళాకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులు చేర్పులు చేశారని పేర్కొంటూ అధికారులు ఆ బంగళా గేటుకు నోటీసులు అంటించారు.

ఈ బంగళాను 'మణికర్ణిక కార్యాలయం' పేరుతో కంగనా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించుకుంది. తన సొంత ఆఫీస్‌గా ప్రకటించి అక్కడ నుంచే సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది.

అయితే.. తన కార్యాలయాన్ని కూల్చబోతున్నట్లు కంగనా ఇప్పటికే ప్రకటించింది. ఆమె ఆఫీస్‌లో బీఎంసీ అధికారులు ఉన్నట్లు ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తన అనుమతి లేకుండా కార్యాలయంలోకి అధికారులు వెళ్లారని, కొలతలు తీసుకున్నారని.. కంగనా వీడియోలో స్పష్టం చేసింది.

కాగా, ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చుతూ కంగనా వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే ఆమె కార్యాలయంలో బీఎంసీ అధికారులు కనిపించడం గమనార్హం. కంగనా కార్యాలయాన్ని కూల్చాలని నిర్ణయించి.. ఉద్దేశపూర్వకంగా బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు అంటించిందని ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :