శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:50 IST)

కంగనా రనౌత్‌కు 'వై ప్లస్' కేటగిరీ సెక్యూరిటీ, ఏమిటిది? ఎలా ఉంటుంది?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ కేటగిరీ సెక్యూరిటీని అందించాలని నిర్ణయించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుతో పాటు బాలీవుడ్ లావాదేవీల విషయంలోనూ సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ నటి కంగానా రనౌత్‌.. ముంబయిలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కొద్ది రోజుల కిందట చెప్పారు. ఆమెకు రక్షణ కల్పించాలంటూ ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 
తాజగా కేంద్ర ప్రభుత్వం తనకు సెక్యూరిటీ అందించినట్లు వార్తలు రావడంతో ట్విటర్ ద్వారా స్పందించిన కంగన.. హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పారు. “దేశభక్తుల గళాన్ని ఏ ఫాసిస్టులూ నొక్కేయలేరనడానికి ఇది రుజువు. నేను అమిత్ షాకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఆయన, కావాలంటే కొన్ని రోజుల తర్వాత ముంబయి వెళ్లమని నాకు సలహా ఇచ్చేవారు. కానీ, ఆయన భారత్‌లోని ఒక కూతురి మాటలకు విలువ ఇచ్చారు. మా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని గౌరవించారు. జై హింద్” అని ట్వీట్ చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కంగనా మధ్య మాటల యుద్ధం తీవ్ర కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 
'వై ప్లస్’ సెక్యూరిటీ ఎలా ఉంటుంది?
భారత్‌లో నేతలకు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత కల్పిస్తారు. వీరిలో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు.

 
‘జడ్’ కేటగిరీలో 22 మంది సెక్యురిటీ సిబ్బంది ఉంటారు. ఈ కేటగిరీలో వారికి ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులను సెక్యురిటీగా నియమిస్తారు. ఈ కేటగిరీ సెక్యూరిటీలో ఎస్కార్ట్స్, పైలెట్ వాహనం కూడా ఇస్తారు. ‘వై’ కేటగిరీలో 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వారిలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (పీఎస్ఓ)లు కూడా ఉంటారు.

 
ఇక కంగనకు ఇచ్చిన ‘వై ప్లస్’ కేటగిరీ సెక్యూరిటీలో ఒక ఎస్కార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు అదనంగా ఒక గార్డ్ కమాండర్, నలుగురు గార్డులు ఉంటారు. ఈ గార్డుల్లో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఉంటాడు. మిగతా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి.

 
సంజయ్ రౌత్‌, కంగన మాటల యుద్ధం
సంజయ్ రౌత్, కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధం తీవ్రం కావడంతో తన కూతురికి సెక్యూరిటీ కల్పించాలని కంగన తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. “సంజయ్ రౌత్, శివసేన నేతలు ముంబయికి తిరిగి రావద్దని బహిరంగంగా బెదిరిస్తున్నారు. ముంబయి వీధుల్లో ఆజాదీ గ్రాఫిటీ తర్వాత ఇప్పుడు బహిరంగ బెదిరింపులు వస్తున్నాయి. ముంబయి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లా ఎందుకు అనిపిస్తోంది” అని కంగన గతవారం ట్వీట్ చేశారు.

 
అంతకు ముందు ట్విటర్‌లో కంగనా రనౌత్ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో సంజయ్ రౌత్ ఒక టీవీ చానల్‌తో తన గురించి మాట్లాడుతూ ఒక అభ్యంతరకర మాటను ఉపయోగించడంపై ఆయనకు సమాధానం ఇచ్చారు. తనను వేధించేవారిని ప్రోత్సహించిన సంజయ్ రౌత్‌ను దేశంలో యువతులు క్షమించరని ఆమె ఆ వీడియోలో అన్నారు.

 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై మాట్లాడుతూ ముంబయి పోలీసులపై తనకు నమ్మకం పోయిందని కంగన ఒకసారి అన్నారు. దీనిపై స్పందించిన సంజయ్ రౌత్ "ముంబయి పోలీసులపై నమ్మకం లేకపోతే, ఆమె ముంబయికి రాకపోవడమే మంచిద"ని అనడంతో ఈ వివాదం మొదలైంది.

 
ముంబైలో నా ఆఫీసును కూల్చేయటానికి వచ్చారు: కంగనా ట్వీట్
ముంబయి పాలీ హిల్‌లోని కంగనా రనౌత్ ఆఫీసుకు బీఎంసీకి చెందిన ఒక టీమ్ చేరుకుంది. దీనిపై ట్వీట్ చేసిన కంగనా వారు ఎందుకు వచ్చారో చెప్పింది. "ఇది ముంబయిలో మణికర్ణిక సినిమా ఆఫీస్. దీన్ని నేను 15 ఏళ్లు కష్టపడి సంపాదించాను. నేను సినిమా నిర్మాత అయినప్పుడు, ఒక సొంత ఆఫీస్ కట్టుకోవాలని నాకు జీవితంలో ఒకే ఒక కల ఉండేది. కానీ అది ఇప్పుడు కుప్పకూలే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తోంది.

 
ఈ రోజు అక్కడకు హఠాత్తుగా బీఎంసీ నుంచి కొందరు వచ్చారు. వారు బలవంతంగా నా ఆఫీసులోకి వచ్చారు. అన్నీ కొలుస్తున్నారు. వాళ్లు ఇరుగుపొరుగువారిని కూడా ఇబ్బందిపెట్టారు. 'ఆ మేడమ్ ఉందే, ఆమె చేసిన పనికి అందరూ అనుభవించాల్సిందే' అన్నారు. వాళ్లు రేపు నా ప్రాపర్టీ కూల్చబోతున్నట్టు నాకు సమాచారం అందింది" అని ట్వీట్ ద్వారా తెలిపారు.

 
బీఎంసీకి చెందిన ఒక అధికారితో బీబీసీ మాట్లాడింది. పేరు చెప్పద్దనే షరతుతో ఆయన "బీఎంసీ నుంచి ఒక టీమ్ కంగనా ఆఫీసుకు చేరుకుంది. కానీ వారు అక్కడకు ఎందుకు వెళ్లారు అనే సమాచారం నాకు తెలీదు. అక్కడికి బీఎంసీ టీమ్ ఎందుకు వెళ్లిందో ఆ వార్డ్ ఆఫీసర్ మాత్రమే చెప్పగలరు" అన్నారు.

 
బీఎంసీకి చెందిన ఒక సీనియర్ అధికారితో కూడా బీబీసీ మాట్లాడింది. ఆయన కూడా పేరు రాయద్దనే షరతుపై "వీడియోలో బీఎంసీ వాళ్లు కనిపిస్తున్నారు. కానీ వాళ్లు అక్కడకు ఎందుకు వెళ్లారు అనేదానిపై మా దగ్గర ఎలాంటి అధికారిక సమాచారం లేదు" అన్నారు.

 
కంగనా రనౌత్ ఇటీవల ముంబయి పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లా ఉందని పోలుస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నుంచీ శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వరకూ కంగనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.