సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:04 IST)

ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యే టైమ్ చెబుతా... దమ్మున్నవాళ్ళెవరో వచ్చి ఆపండి.. కంగనా సవాల్

మహారాష్ట్రంలోని శివసేన నేతలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బహిరంగ సవాల్ విసిరింది. ముందుగా తేదీ చెబుతున్నా, ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యే సమయం కూడా చెబుతా.. దమ్మున్నవాళ్ళెవరో వచ్చి ఆపండంటూ ఆమె ఛాలెంజ్ చేసింది. 
 
తనను ముంబై రావొద్దంటూ చాలామంది బెదిరిస్తున్నారని కంగనా ఇటీవల ఆరోపణలు చేశారు. పైగా, కంగనాకు ముంబైలో ఉండే హక్కులేదని, ముంబైలో ఆమెను కాలుమోపనివ్వబోమని, ముంబై వస్తే చచ్చేదాకా కొడతామని శివసేన నేతలు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. కానీ తాను ముంబయి రావాలని నిర్ణయించుకున్నానని తాజాగా ఆమె స్పష్టం చేశారు. 
 
ఈ హెచ్చరికలపై ఆమె స్పందిస్తూ, సెప్టెంబరు 9న ముంబైలో అడుగుపెడుతున్నానని, ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే టైమ్ కూడా చెబుతానని, దమ్మున్నవాళ్లెవరో తనను ఆపుకోవచ్చని సవాల్ విసిరారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ బంధుప్రీతి గురించి, డ్రగ్స్ దందా గురించి కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరణ్ జొహార్ వంటి బడా ఫిలింమేకర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చాయి.
 
కాగా, కంగనా రనౌత్ సవాల్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆమె ఒక మెంటల్ కేసు అని అన్నారు. తిన్న పళ్లెంలోనే ఉమ్మేసే రకం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనాను తాము బెదిరించామని ఆమె చెప్పుకుంటోందని... తాము ఎవరినీ బెదిరించమని అన్నారు. 
 
ముంబైని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదని చెప్పారు. ముంబైని కానీ, మహారాష్ట్రను కానీ కించపరుస్తూ మాట్లాడితే తాము సహించబోమని హెచ్చరించారు. ఆమె వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు.
 
1992లో ముంబై పేలుళ్లు జరిగినప్పుడు నగర పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి జనాల ప్రాణాలను కాపాడారని సంజయ్ గుర్తుచేశారు. కరోనా వైరస్ సమయంలో విధులు నిర్వహిస్తూ పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. హీరో సుశాంత్ మరణం కేసు విచారణలో ముంబై పోలీసుల చిత్తశుద్ధిని కించపరుస్తూ కంగనా మాట్లాడుతోందని సంజయ్ దుయ్యబట్టారు.