గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (15:21 IST)

సీఎం జగన్ సర్కారుకు దెబ్బమీద దెబ్బ.. సుప్రీంలో మళ్లీ ఎదురుదెబ్బ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, సర్కాలు తన వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా నిర్బంధ ఇంగ్లీష్ మీడియం అంశంపై మరోమారు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 
 
గతంలో ఇంగ్లీష్‌ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంతో ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
 
అదేసమయంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ), స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
 
ఈ కేసు విచారణ సమయంలో ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు తీర్పుపై స్టే, నోటీస్ ఇవ్వాలని కోరారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదని గుర్తుచేశారు. 
 
ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని, అందుకే తమ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. 
 
అదేసమయంలో ప్రతివాదుల తరపున హాజరైన న్యాయవాది శంకర్‌నారాయణ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని సుప్రీంకోర్టుకు వివరించారు. 
 
తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఇరువురు వాదనలు, ప్రతినాదలు ఆలకించిన సుప్రీంకోర్టు ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంతీర్పుతో జగన్ సర్కార్‌కు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయినట్టయ్యింది.