శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (18:43 IST)

శ్రీవారి లెక్కలన్నీ ఇక కాగ్ చేతిలోకి... దర్శన టిక్కెట్ల కోటా పెంపు (video)

కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తోంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం గురువారం నుంచి రూ.300 దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. గంటకు వంద టికెట్ల చొప్పున ప్రస్తుతం రోజుకు 1000కి పైగా టికెట్లను ఆన్‌లైన్లో అదనంగా కేటాయించనుంది. ప్రస్తుతం రోజుకు 9 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందిస్తోంది. 
 
ఇదిలాఉండగా భాద్రపద పౌర్ణమి సందర్భంగా బుధవారం తిరుమల ఆలయంలో శ్రీవారికి గరుడ సేవ నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి స్వామివారికి గరుడ సేవ చేయడం ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. రంగనాయక మంటపంలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించారు. కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం స్వామివారికి ఏకాంతంగా ఈ సేవ నిర్వహించారు.
 
అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరిగే ఆడిట్‌పై విమర్శల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆడిట్‌ను ఇకపై నుంచి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ద్వారా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాలకమండలి సిఫార్సు చేసింది. 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించారు. దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి కోరింది.
 
వీటిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
 
ఇక టీటీడీ తాజా నిర్ణయంపై సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్నది గొప్ప నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం వెల్లడి చేసినందుకు ఏపీ సీఎం జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో కాగ్‌తో ఆడిట్ చేయించడానికి అంగీకరించారని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దీనిపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి... ఏపీ సీఎం  అవినీతిరహిత పాలనలో ఎంతగా నిబద్ధతతో ఉన్నారో దీని ద్వారా తెలుస్తోందని చెప్పుకొచ్చారు.