Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్
బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గురుగ్రహాన్ని శాంతింపజేసుకోవాలంటే.. గురువారం పూజ తప్పనిసరి. గురువు పెరుగుదల, విజయం, వైద్యం, దృష్టి, మేధో, జ్ఞానం, ఆధ్యాత్మికత, అవకాశాలు, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం, అదృష్టానికి కారకుడు. బృహస్పతిని విష్ణువు అవతారం అని విశ్వాసం. అదే నమ్మకంతో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి గురువార ఉపవాసం పాటిస్తారు.
శుక్ల పక్షంలో వచ్చే మొదటి గురువారం నుండి ఈ గురువార వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఈ పవిత్రమైన ఆచారం సూర్యోదయంతో ప్రారంభమై సాయంత్రం ముగుస్తుంది. వరుసగా 16 గురువారాలు లేదా 3 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరుకున్న ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
గురువార వ్రతం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు ఆహార పదార్థాలు, పువ్వులను ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున బృహస్పతికి పసుపు రంగు పువ్వులు, దండలు, పసుపు అన్నం, అరటిపండు, లడ్డూ, శనగపిండి హల్వా వంటి పదార్థాలను ప్రసాదంగా సమర్పించాలి.
ఆవు నెయ్యితో దీపం, అగరబత్తులను వెలిగించాలి. నుదుటిపై పసుపు తిలకం ధరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. గురు మంత్రాలను జపించాలి. బృహస్పతి దేవుడిని స్తుతిస్తూ గురువార వ్రత కథను పఠించాలి. పూజను ముగించడానికి హారతి, ప్రార్థన చేయాలి. ఈ రోజున ఆలయంలో లేదా పేదలకు బట్టలు, ఆహారం, పసుపు వంటి పసుపు రంగు వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
జపించవలసిన మంత్రాలు:
ఓం బృం బృహస్పతయే నమః
ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః
ఒక వ్యక్తి ఆరోగ్యం, సంపద, కీర్తిని పొందగలడు. గురువార వ్రతం పాటించడం వల్ల బృహస్పతి దేవుని ఆశీస్సులతో జ్ఞానం, వివేకం లభిస్తాయి.