శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2025 (14:34 IST)

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

Montha Cyclone
Montha Cyclone
నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. మొంథా తుఫాను కారణంగా నాగర్ కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బైరాపూర్ వ‌ద్ద రోడ్డుపై నుంచి వాగు ప్ర‌వ‌హిస్తుండ‌డంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. 
 
క‌ల్వ‌కుర్తి మండ‌లం ర‌ఘుప‌తిపేట వ‌ద్ద దుందుభి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. దీంతో క‌ల్వ‌కుర్తి - నాగ‌ర్‌క‌ర్నూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని ఉప్పునుంత‌ల‌లో అత్య‌ధికంగా 20.8 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట- అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు దాటేందుకు ప్రయత్నించి కారు చిక్కుకుపోయింది. కారులో చిక్కుకుపోయిన వారిని జేసీబీ సాయంతో అధికారులు కాపాడుతున్నారు. కారులో ఎంతమంది వున్నారు ఏంటి సంగతి.. కారులోని వారికి ఏమైంది అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 
వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఇలా కారులో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అధికారులు మండిపడుతున్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, షాకింగ్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతలా వరద ఉధృతి వున్న వాగును ప్రస్తుతం దాటుకుని వెళ్లడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.