రియా చక్రవర్తి 'కిలేడీ'.. బెయిల్ ఇవ్వొద్దు... ఎన్.సి.బి... షాకిచ్చిన కోర్టు
బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ముంబై సెషన్స్ కోర్టు షాకిచ్చింది. డ్రగ్స్ దందాలో అరెస్టు అయిన రియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే, ఇదే కేసులో అరెస్టు అయిన ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరికొందరి పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో రియా చక్రవర్తి మరోమారు హైకోర్టు లేదా సుప్రీంకోర్టుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
కాగ, బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో డ్రగ్స్ కోణం బహిర్గతమైంది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) ఆరా తీయగా రియా చక్రవర్తితోపాటు.. ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరాండాలకు డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. దీంతో ఎన్.సి.బి వీరందరినీ అరెస్టు చేసింది.
ఆ తర్వాత రియాను ముంబైలోని బైకులా జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో ముంబైలోని కింది కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సదరు న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు రియా చక్రవర్తి ఈ నెల 22వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉండనుంది.