శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 మే 2020 (09:06 IST)

ఈసారి పాక్ కు నో రంజాన్ స్వీట్స్

ఈసారి పాకిస్థాన్ కు మన దేశ స్వీట్లు దక్కలేదు. నిత్యం తన వక్రబుద్ధితో పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంటున్న పాక్ ను అంతగా ఆలింగనం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమైంది.

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈద్‌ సందర్భంగా ఈ ఏడాది సాంప్రదాయబద్దంగా నిర్వహించే స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.

ప్రతి ఏడాది ప్రత్యేక పండుగ దినోత్సవాల్లో బిఎస్‌ఎఫ్‌ జవానులు, పాక్‌రేంజర్లు సరిహద్దులో స్వీట్లను పంపిణీ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది జమ్ము నుండి గుజరాత్‌ వరకు సరిహద్దులో అలాంటి కార్యక్రమం జరగలేదని అధికారులు తెలిపారు.

అయితే బంగ్లాదేశ్‌ సరిహద్దులో మాత్రం స్వీట్ల పంపిణీ జరిగిందని అధికారులు తెలిపారు. ఈద్‌ వంటి ప్రత్యేక పండుగల సందర్భంగా ఇరు దేశాల సరిహద్దు రక్షణ దళాలు స్వీట్లు పంచుకోవడంతో వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, బంధం మరింత పటిష్టవంతంగా ఉంటాయని దక్షిణ బెంగాల్‌ సరిహద్దులోని బిఎస్‌ఎప్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

గతేడాది ఫిబ్రవరి 14న పాక్‌ ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతిచెందడంతో.. ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నప్పటికీ సరిహద్దుల్లో ఉగ్రవాద ఘటనలు తగ్గలేదని, సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంబడి పాక్‌ తన లాంచ్‌ పాడ్‌ల ద్వారా ఉగ్రవాదులను దేశంలోకి పంపుతోందని భారత సైన్యం పేర్కొంది.