మోడీ మా ప్రధాని..మాట జారితే తాట తీస్తా : కేజ్రీవాల్
రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా దేశం దగ్గరకొచ్చేసరికి భారతీయులంతా ఒక్కటే అన్న స్ఫూర్తిని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాటారు. అలా చాటడం ద్వారా భారత సమైక్యతకు బయటవారు ఏ మాత్రం హాని కలిగించలేరని తేల్చి చెప్పారు.
అసలు విషయమేమిటంటే… భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పాకిస్తాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టి ఝలక్ ఇచ్చారు. భారత ప్రధానమంత్రిపై పాకిస్తాన్ నోరెత్తకుండా చేశారు. మోడీని ఏదైనా అంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.
ఇటీవల ఓ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ…యుద్ధం వస్తే 10 రోజుల్లో పాకిస్తాన్ దేశాన్ని భారతదేశం ఓడించగలదు అన్న సంగతి తెలిసిందే. మోడీ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ మంత్రి ఫవాద్ చౌదరి..మోడీ పిచ్చితనాన్ని భారత ప్రజలు తప్పనిసరిగా ఓడించాలన్నారు.
ఢిల్లీలో ఎన్నికలు ఉన్న కారణంగా ఓడిపోతామనే ఒత్తిడిలో మోడీ ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దక్షిణాసియా ప్రాంతానికి అపాయం కలిగించే బెదిరింపులు చేస్తున్నారన్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా కశ్మీర్, పౌరసత్వసవరణ చట్టం, ఆర్థికవ్యవస్థ పతనం వంటి విషయాల్లో అంతర్గతంగా, బయటి దేశాల నుంచి వస్తున్న స్పందనతో మోడీ బాలెన్స్ కోల్పోయారని కూడా అన్నారు.
పాక్ మంత్రి వ్యాఖ్యలపై కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు.. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. నరేంద్రమోడీ భారతదేశ ప్రధానమంత్రి అని, ఆయన తనకు కూడా ప్రధానమంత్రేననీ పేర్కొన్నారు. దేశ ప్రధానిని ఏమైనా అంటే ఊరుకునే ప్రశక్తే లేదని పాక్ మంత్రిని హెచ్చ రించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాద ఆర్గనైజర్‌గా ఉన్న పాకిస్తాన్ భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడితే సహించబోమని అన్నారు. అంతేకాకుండా పాక్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా భారతీయ సమైకత్యకు హాని కలిగించలేదని ఆప్ అధినేత పేర్కొన్నారు.