శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2014 (16:16 IST)

ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి సాహిత్య నోబెల్ ప్రైజ్!

ఈ యేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి దక్కింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన 11వ ఫ్రెంచ్ రచయిత ఈయన. పాట్రిక్‌ మోదియానోకి స్వీడిష్ నోబెల్ అకాడమీ నోబెల్ బహుమతి కింద 6.7 కోట్ల నగదును అందజేయనున్నారు. చారిత్రక విషాదాలకు కావ్య గౌరవం కల్పించిన ఈ సుప్రసిద్ధ ఫ్రెంచి రచయితను సాహిత్య నోబెల్‌ వరించింది. రెండో ప్రపంచ యుద్దంలో యూదులపై నాజీలు సాగించిన అమానుష కాండతో కాలానికి అంటిన కన్నీటిని, నెత్తుటిని పాట్రిక్‌ అక్షరాలకెత్తారు. ‘ఊహకు కూడా అందనంత మానవ విషాద విధిరాతను, తెర వెనకే ఉండిపోయిన చెరలోని బతుకులను స్మృతి చిత్రణ చేశార’ని స్వీడిష్‌ అవార్డు కమిటీ కొనియాడింది.
 
జర్మనీ నియంత హిట్లర్‌ ప్రపంచంపై యుద్ధాన్ని రుద్దినప్పుడు.. రష్యా తర్వాత అంతగా కల్లోలపడిన దేశం ఫ్రాన్స్‌. నాజీల కరకు కత్తుల నుంచి తప్పించుకునేందుకు యూదులు ఫ్రాన్స్‌ని ఆశ్రయించారు. ఇలా ఆ దేశానికి వలసపోయిన కుటుంబాల్లో పాట్రిక్‌ కుటుంబం ఒకటి. ఇటాలియన్‌ యూదు అయిన ఆయన తండ్రి.. ప్రాణాలను కాపాడుకునేందుకు ఫ్రాన్స్‌కు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. యూదు వల స వెతలను, అస్తిత్వ వేదనను తండ్రి అనుభవం నుంచి గ్రహించి ‘మిస్సింగ్‌ పర్స న్‌’’ అనే నవలని పాట్రిక్‌ రాశారు. ఇప్పుడు ఈ రచనకే నోబెల్‌ కమిటీ.. అవార్డు ప్రకటించింది.