బోరున విలపించిన కిమ్ జాంగ్ ఉన్..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బోరున విలపించారు. ప్రపంచంలోనే అత్యంత పాషాణ హృదయుడుగా పేరొందిన కిమ్ ఈ ఉత్తర కొరియా హిట్లర్.. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశ ప్రజల ముందు కంటతడి పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ తల్లులకు చెబుతూ కన్నీళ్లు కార్చారు. ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు బాగా క్షీణించిపోయింది. ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
ఇందులో అధ్యక్షుడు కిమ్ మాట్లాడుతూ.. 'జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది' అని తెలిపారు. దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అయితే, గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. కరోనా వెలుగుచూసిన నాటి నుంచి కిమ్ తమ దేశ సరిహద్దులను మూసివేశారు. ప్రపంచంతో చాలా వరకు ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. దీంతో వ్యాపార, వాణిజ్యాలు సాగక ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గుతున్నట్లు గతంలో పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇలాంటిసమయంలో మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్ సూచించడం గమనార్హం.