Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..
భారతదేశం "ఆపరేషన్ సింధూర్" ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్‌లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌లో నివసిస్తున్న తన పౌరులకు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, సాయుధ దళాల మధ్య ఘర్షణలకు అవకాశం ఉందని పేర్కొంటూ, నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించకుండా అమెరికన్ పౌరులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
రెండు దేశాల మధ్య వైమానిక స్థలాన్ని మూసివేయడం వంటి పరిణామాలతో సహా, పాకిస్తాన్‌లో మారుతున్న పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో నివసించే నివాసితులు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సలహా ఇచ్చింది.
వివాదాస్పద ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తులు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాలని కూడా ఇది సూచించింది."ఆపరేషన్ సిందూర్" కింద పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడులకు ప్రతిస్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
"రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. భారతదేశం- పాకిస్తాన్ గొప్ప చరిత్రలను కలిగి ఉన్నాయి. వాటి మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ప్రపంచం శాంతిని మాత్రమే కోరుకుంటుంది. ఇకపై ఘర్షణలు లేవు" అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇంతలో, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం దాడులకు సంబంధించి వివరణ ఇచ్చింది.
"విశ్వసనీయ సాక్షుల కథనాలు, సాంకేతిక నిఘా ఆధారంగా భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. దీనికి మద్దతు ఇచ్చే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఆపరేషన్లు పౌర ప్రాంతాలు, ఆర్థిక వనరులు లేదా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు - ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి జరిగింది" అని ఒక ప్రతినిధి పేర్కొన్నారు.