1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 మే 2025 (16:56 IST)

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Operation Sindoor
పహల్గాం ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయిందని, దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన స్పందిస్తూ, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుందన్నారు. 
 
'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' పేరుతో పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిట్టు సైన్యం ప్రకటించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు.
 
"పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయింది. పహల్గాం దాడిపై దర్యాప్తు చేపట్టగా.. దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లు బయటపడింది. ఉగ్రమూకలకు పాక్ అండగా నిలుస్తోంది. 
 
పహల్గాం దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. టీఆర్ఎఫ్‌కు పాక్ అండదండలున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌పై ఇప్పటికే నిషేధం ఉంది. ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేశాయి. భారత్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయి. వాటిని అడ్డుకోవడం, ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించాం. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశాం' అని మిస్ట్రీ వెల్లడించారు.