సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (15:22 IST)

పాకిస్థాన్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.12 వేలు

పాకిస్థాన్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర ఆకాశాన్ని తాకుతోంది. ఒక్క సిలిండర్ ధర రూ.12 వేలకు చేరుకుంది. దీంతో ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంత సొమ్ము చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయలేని వారంతా కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. 
 
నిజానికి గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ పలు సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఇలాంటి వాటిలో గ్యాస్ నిల్వల సంక్షోభం. ముఖ్యంగా శీతాకాలంలో ఈ వంట గ్యాస్ నిల్వలు పూర్తిగా తగ్గిపోతుంటాయి. ప్రతి యేటా శీతాకాలంలో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 
 
గృహ అవసరాల కోసం వినియోగించే పాకిస్థాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అదేసమయంలో ఆ దేశంలో గ్యాస్ నిక్షేపాలు ప్రతి యేటా 9 శాతం మేరకు తగ్గిపోతున్నాయి. అంటే రెండేళ్ళలో 18 శాతం గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఎన్ఎల్జీనికి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీని రవాణాకు 800 కోట్ల డాలర్లు (రూ.60293 కోట్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
దీంతో ఎల్ఎన్జీ సిలిండర్ ధర గత యేడాది 4500 ఉండగా, ఇపుడు అది రూ.12 వేలకు చేరుకుందని ఓ వ్యాపారి వాపోయారు. వంట చెరకు ధర కూడా రెట్టింపు అయింది. 40 కిలోల వంట చెరకు ధర గతంలో రూ.450గా ఉంటే ఇపుడు అది రెట్టింపు అయింది. దీంతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు.