శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (12:31 IST)

పావురాల ద్వారా పాక్ గూఢచర్యం, అక్టోబర్ నెలలో దాడికి ప్లాన్?

రాజస్థాన్‌లో చిక్కిన ఓ పావురం రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు కనిపించడంతో భద్రతా బలగాలు షాక్ అయ్యాయి. వచ్చే స్వాతంత్రదినోత్సవం నాడు ఉగ్రదాడులు జరిపే పన్నాగమని అనుమానిస్తున్నాయి. పూర్వకాలంలో పావురాల ద్వారా రాజులు తమ సందేశాలను పంపేవారు. 
పంద్రాగస్టు వేడుకల్లో విధ్వంసానికి కుట్రలకు ఇది సూచికగా భావిస్తున్నారు. దీనితో పాక్ సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమయింది.
 
అనుమానస్పదంగా డ్రోన్లు, పావురాల కదలికలున్నాయనిభద్రత దళాలు పేర్కోంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమమత్తయాయి. మరోవైపు సరిహద్దుల్లో డ్రోన్‌లు కలకలం కొనసాగుతుండగా.. రాజస్థాన్ సరిహద్దుల్లో దొరికిన ఓ పావురం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని బికనీర్‌ జిల్లాలో చిక్కిన పావురం రెక్కలు, కాళ్లపై మొబైల్ నంబర్ రాసి ఉండటం పోలీసులు గుర్తించారు. అది పాకిస్థాన్ మొబైల్ నంబర్ కావడంతో నిఘావర్గాలు దర్యాప్తు చేపట్టాయి.
 
పావురం రెక్కలపై మొబైల్ నంబర్‌తో పాటూ అక్టోబరు అని రాసి ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అక్టోబరులో పెద్ద కుట్రకే ఉగ్రవాదులు తెరతీశారనే అనుమానం బలపడుతోంది. మహాజన్ ఏరియాలో ఓ పావురాన్ని సరదాగా పట్టిన వ్యక్తి.. దాని రెక్కలపై మొబైల్ నంబర్.. కాలికి ఏదో రింగులాంటిది ఉండటంతో షాక్ అయ్యాడు. దీంతో ఆయన పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.
 
పాకిస్థాన్ సరిహద్దులు కావడంతో... పోలీసులు, ఐబీ, భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇది ఉగ్రవాదుల రహస్య కోడ్ సంకేతమా? ప్రేమికులు ఇలా చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా ఈ పావురాన్ని పెంచుకుంటున్నారా? అనే అనుమానంతో విచారణ చేపట్టారు. గతంలో పావురాల ద్వారా పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడిన సందర్భాలున్నాయి. నిరంతరం గూఢచారి పావురాలు దేశంలోకి చొరబడుతున్నాయి. నెల రోజుల కిందట శ్రీగంగానగర్‌ జిల్లా ఘండ్సానా వద్ద ఓ పావురం చిక్కగా.. దాని కాళ్లకు ఓ లేఖ కట్టి, స్టాంప్ వేసి ఉంది.
 
రెక్కలకు రంగులు వేసిన ఉన్న ఈ పావురం స్థానిక పొలాల్లో కనిపించడంతో ఆ గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పంజాబ్‌లోనూ ఇటీవల కాళ్లకు ఓ చిట్టీ కట్టి ఉన్న పావురం దొరికింది. ఇది ఓ బీఎస్ఎఫ్ అధికారి భుజాలపై వచ్చి వాలడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు.