గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (17:14 IST)

పెగాసస్ ప్రకంపనలు : ఛలో రాజ్‌భవన్ పిలుపు - సీతక్క అరెస్ట్

పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వ్యవహారంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అలాగే, ఈ స్పై వ్యవహారంపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇదిలావుంటే, ఈ  స్పై వ్యవహారానికి నిరసనగా కాంగ్రెస్ ఛలో రాజ్‌భవన్‌ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రాజ్‌భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. 
 
ఈ ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు మోతె రోహిత్ నేతృత్వంలో జరిగింది. రాజ్‌భవన్ వద్ద జెండాలు ఎగురవేసి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్త్ ఉన్నప్పటికి రాజ్ భవన్‍‌లోకి దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. 
 
అయితే, వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. విడతల వారిగా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి వచ్చారు. దీంతో ఎప్పటికప్పుడు ముట్టడికి వస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వర్షంలోనూ  రాజ్ భవన్ పరిసరాలలో 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీని నిర్వ‌హించి రాజ్‌భ‌వ‌న్ ముందు ఆందోళ‌న నిర్వ‌హించి గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఇందిరాపార్క్ వ‌ద్ద‌కు వచ్చారు. వ‌ర్షాన్నిసైతం లేక్క‌చేయ‌కుండా ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే, ర్యాలీకి అనుమ‌తి లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.