గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 జులై 2021 (14:22 IST)

తెలంగాణలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

తెలంగాణలో రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో రాష్ట్రవాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 
 
మరోవైపు సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది.
 
ఇక ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద నీటి వలన, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90% చేరింది. దీంతో ఏ సమయంలోనైనా ప్రాజెక్టు గేట్లు తెరవనుండడంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
గోదావరి నది పరివాహక గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు మరియు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లకుండా రెవెన్యూ శాఖ మరియు పోలీసు శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులు హెచ్చరించారు.