బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (08:18 IST)

తెలంగాణాలో భూముల ధరలకు రెక్కలు.. పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజులు

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అదేసమయంలో పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ రుసుములు కూడా పెంచింది. ఇవన్నీ గురువారం నుంచి అమల్లోకిరానున్నాయి. 
 
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల విలువను మొత్తం మూడు శ్లాబులుగా విభజించింది. అయితే రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి పెరిగిన విలువలు, చార్జీలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. 
 
ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పు చేర్పులు చేశారు.
 
భూముల విలువ తక్కువగా ఉన్న చోట 50 శాతం, మధ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో 40 శాతం, ఎక్కువగా ఉన్న చోట మాత్రం 30 శాతం ధరలు పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. కొత్త ధరలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ధరణి పోర్టల్‌లో కూడా మార్పులు చేసేశారు. 
 
ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా కొత్త చార్జీల ప్రకారమే చెల్లింపులు చేసి… రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. ఇప్పటికే స్లాటు బుక్ చేసుకున్న వారు 30,891 మంది ఉన్నారు. వీరంతా అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీలకు అనుగుణంగా ‘ధరణి’ పోర్టల్‌లోనూ మార్పులు చేశారు.