బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (19:09 IST)

కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంది.. సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డికి ఉజ్వలభవిష్యత్ ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కీలక నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్‌ రెడ్డి బుధవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన కౌశిక్‌ రెడ్డికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని, కౌశిక్‌ రెడ్డి భవిష్యత్‌కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 
 
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారికి స్వాగతం పలికారు. మలిదశ ఉద్యమంలో కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌ రెడ్డి తనతోని భుజం కలిపి పనిచేసినట్లుగా సీఎం గుర్త చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించామన్నారు. 
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక విపత్కర పరిస్థితి ఉండేదన్నారు. కరెంట్‌ కోతలు, తాగేందుకు మంచినీళ్లు లేవు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అవగాహనతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ వచ్చామని వివరించారు. ప్రస్తతం తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.