గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (14:29 IST)

తడిసి ముద్దవుతున్న హైదరాబాద్ - 70 శాతం అధిక వర్షాలు

భాగ్యనగరం హైదరాబాద్ తడిసి ముద్దవుతుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షంపాతం నమోదైంది. ముఖ్యంగా, న‌గ‌రంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మంగళవారం వ‌ర‌కు న‌గ‌రంలో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్ల తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించింది. 
 
జులై 20వ తేదీ వ‌ర‌కు 359.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఈ తేదీ వ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 210.9 మి.మీ. మాత్ర‌మే. ఐఎండీ డాటా ప్ర‌కారం.. జులైలో నెల‌లో 285.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, గ‌త ప‌దేళ్ల‌లో ఇదే అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించింది. ఇక రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.
 
ముఖ్యంగా, నైరుతి రుతుపవనాల రాకతోపాటు ఆదిలాబాద్, వ‌రంగ‌ల్ అర్బ‌న్, వ‌రంగ‌ల్ రూర‌ల్, సిద్దిపేట‌, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇక హైద‌రాబాద్‌లో కూడా రాబోయే మూడు రోజుల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.