మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మార్చి 2025 (17:53 IST)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

plane
ఓ పైలెట్ తన విధుల్లో నిర్లక్ష్యం వహించాడు. ఎంతో కీలకమైన పాస్‌పోర్ట్‌ను మరిచిపోయాడు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల లాస్‌ ఏంజెలెస్ నుంచి చైనాలోని షాంఘై నగరానికి అమెరికాకు చెందిన ఓ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా రెండు గంటల పాటు ప్రయాణం సాగిన తర్వాత అకస్మాత్తుగా వెనక్కి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోలో దిగింది. 
 
ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తొలుత ఏమి జరిగిందో అర్థంకాక కొద్దిసేపు కంగారు పడ్డారు. విధుల్లో ఉన్న పైలెట్ తన పాస్‌పోర్ట్ మరిచిపోవడంతో వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రకటించడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
మరోవైపు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆహారంతో పాటు పరిహారాన్ని ఇవ్వనున్నట్టు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అదేరోజు సాయంత్రం వారిని గమ్యస్థానాలకు పంపించామని వెల్లడించింది. అయితే, సాధారణ సమయంలో పోలిస్తే ఆరు గంటల ఆలస్యంగా విమానం షాంఘైకు చేరుకుందని తెలిపింది.