శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (15:50 IST)

కప్పు కాఫీతో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్... 326 ప్యాసింజర్స్ సేఫ్!

సాధారణంగా ఆకాశంలోకి ఎగిరిన విమానానికి ఏదైనా సాంకేతిక సమస్య లేదా మరేదైనా పక్షి ఢీకొన్నట్టయితే అత్యవసర ల్యాండింగ్ చేస్తుంటారు. మరికొన్నిసార్లు ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనైన పక్షంలో హఠాత్తుగా కిందకు దించుతారు. కానీ, ఇక్కడో విమానాన్ని కప్పు కాఫీ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ కప్పు కాఫీకి, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు లింకేంటనే కదా మీ సందేహం. 
 
ఓ ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ330-243 అనే విమానం 326 మంది ప్రయాణికులతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి మెక్సికోలోని కాన్కున్‌కు బయలుదేరింది. అపుడు కాక్ పిట్‌లోకి కాఫీ తీసుకొచ్చిన పైలెట్ కొంచెం తాగి తన పక్కన పెట్టాడు. అయితే గాలి కుదుపుల కారణంగా ఈ కాఫీ కప్పు కాక్ పిట్‌లో పడిపోయింది. దీంతో అక్కడి సర్క్యూట్లలోకి కాఫీ చేరడంతో పొగ, కాలిన వాసన వచ్చింది.
 
వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ఐర్లాండ్‌లోని షానన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడటంతో ఎయిర్ లైన్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గత యేడాది జరిగింది. కానీ, విషయం బయటకురాలేదు. అయితే, తాజాగా ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ విడుదల చేసిన ఓ నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.