నిజమైన మిత్రుడు మోదీ.. ట్రంప్ వ్యాఖ్యతో పాకిస్తాన్‌కు చికాకు తప్పదా..?
అమెరికాలో అడుగుపెట్టీ పెట్టకముందే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆత్మీయ ట్వీట్ అందుకున్నారు. ఒక నిజమైన మిత్రుడికి వైట్ హౌస్‌లో స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ట్రంప్ పెట్టిన ట్వీట్ మోదీని సంతోషపెట్టింది. ఈ ఆత్మీయ
అమెరికాలో అడుగుపెట్టీ పెట్టకముందే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆత్మీయ ట్వీట్ అందుకున్నారు. ఒక నిజమైన మిత్రుడికి వైట్ హౌస్‌లో స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ట్రంప్ పెట్టిన ట్వీట్ మోదీని సంతోషపెట్టింది. ఈ ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, సమావేశం, చర్చల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పలుసార్లు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ భారత ప్రధానిని ఆప్తవాక్యాలతో ఆహ్వానించడం పాక్ పాలకులకు కొత్త శిరోభారం తెప్పించక మానదని పరిశీలకుల వ్యాఖ్య.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో తొలి సారి సమావేశం కానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీకి ముందే ఆత్మీయత కనబరిచారు. మోదీ తనకు నిజమైన మిత్రుడని వ్యాఖ్యానించారు. ‘మోదీకి సోమవారం వైట్‌హౌస్‌లోకి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నాను. ఒక నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలు చర్చకు రానున్నాయి’ అని ఆదివారం ట్వీట్ చేశారు. దీనికి మోదీ ట్వీటర్‌లో బదులిస్తూ ఈ ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, సమావేశం, చర్చల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటన కోసం మోదీ ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకున్నారు. మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. మోదీ బస చేయనున్న విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వద్దకు వేలాదిగా తరలి వచ్చిన భారతీయులు ‘మోదీ.. మోదీ..’అంటూ నినాదాలతో హోరెత్తించారు. హోటల్ వద్దకు చేరుకున్న మోదీ తన వాహనశ్రేణి నుంచి కిందికి దిగి.. అభివాదం చేస్తూ వారివద్దకు వెళ్లారు. మోదీని ఫొటోలు తీసేందుకు ప్రవాస భారతీయులు పోటీ పడ్డారు. ట్రంప్‌తో సమావేశం సందర్భంగా రక్షణ రంగంలో సహకారం, ఉగ్రవాదం తదితర అంశాలతో పాటు హెచ్1బీ వీసాల అంశాన్ని కూడా లేవనెత్తాలని ప్రవాస భారతీయులు కోరుతున్నారు. ట్రంప్‌తో భేటీలో మోదీ హెచ్1బీ వీసాల అంశాన్ని లేవనెత్తితే.. స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది.
సోమవారం మధ్యాహ్నం ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. తర్వాత రిసెప్షన్, వర్కింగ్ డిన్నర్ ఉంటాయి. చివరగా సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. వైట్‌హౌస్‌లో ఇరువురు నేతలు 5 గంటలకు పైగానే సమయం గడుపుతారు. ట్రంప్‌తో భేటీలో వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు, రక్షణ తదితరాలతో పాటు హెచ్1బీ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ శ్వేతసౌధంలోకి అడుగుపెట్టాక ఒక విదేశీ నేతకు విందు ఇవ్వనుండడం ఇదే తొలిసారి.