ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (20:26 IST)

బ్రిటన్‌లో కుమారుడితో భారత సంతతి దంపతులు మృతి.. ఒకరినొకరు కత్తితో..?

బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమారుడితో పాటు విగతజీవులై కనిపించారు. బ్రిటన్‌లోని పశ్చిమ లండన్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రెంట్‌ఫోర్డ్ ప్రాంతంలోని తమ నివాసంలో కుహ రాజ్ సీతంపరనాథన్ (42), ఆయన భార్య పూర్ణ కామేశ్వరి శివరాజ్ (36), వారి కుమారుడు కైలాశ్ కుహ రాజ్ (3)లు విగతజీవులుగా గుర్తించారు. తల్లీ కుమారుడిని గత నెల 21న చివరిసారి చూసినట్టు స్థానికులు తెలిపారు.
 
వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం అర్ధ రాత్రి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. 
 
లోపల కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్ణ కామేశ్వరి, ఆమె కుమారుడు కైలాశ్‌లు విగతజీవులుగా కనిపించారు. ఆమె భర్త కుహ రాజ్‌ కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఉన్నాడని, ఆ వెంటనే అతడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తాము ఇంట్లోకి ప్రవేశించడంతో పూర్ణ భర్త కుహ రాజ్ తనకు తానే పొడుచుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.