శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (11:17 IST)

డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. గొప్ప స్నేహితుడు... (video)

Modi_Donald Trump
Modi_Donald Trump
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇంధనం, భద్రత, ప్రజల మధ్య సంబంధాలు వంటి విభిన్న అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో, ట్రంప్ ప్రధాని మోదీని "టఫ్ నెగోషియేటర్" అని అభివర్ణించారు.
 
ముఖ్యంగా, ప్రధాని మోదీతో సమావేశానికి కొన్ని గంటల ముందు, అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలకు పరస్పర సుంకాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్‌ సింగ్‌ పన్నూను ఉద్దేశిస్తూ ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు. ఈ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్రంప్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ చాలా కాలంగా తనకు "గొప్ప స్నేహితుడు" అని, ఆయనను వైట్ హౌస్‌లో కలవడం గొప్ప గౌరవమని తెలిపారు. తాను, ప్రధాని మోదీ మధ్య అద్భుతమైన సంబంధం ఉందని, నాలుగేళ్ల పాటు ఆ బంధాన్ని కొనసాగించామని ఆయన అన్నారు.