బ్రిటన్ ప్రధాని రేసులో అనూహ్యంగా వెనుకపడిన రిషి సునక్
బ్రిటన్ దేశ ప్రధానమంత్రి రేసులో బలమైన పోటీదారుడుగా ఉంటూ వచ్చిన భారత సంతతి మూలాలున్న ఆ దేశ మాజీ మంత్రి రిషి సునక్ ఇపుడు అనూహ్యంగా వెనుకబడ్డారు. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచిన రిషికి.. ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించినమేర మద్దతు లభించటం లేదు. ఈ విషయాన్ని రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు.
తాజాగా బ్రిటన్‌లోని గ్రాంథాం నగరంలో ప్రసంగించిన సునాక్ తాను వెనుకబడి ఉన్నాననడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారన్నారు.
పార్టీ సభ్యుల్లో కొందరు మాత్రం ప్రత్యామ్నాయం కోరుకొంటున్నారని, ఇలాంటి వారంతా తన మాట వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తుదిపోరులో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.
మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం రిషి సునాక్‌ను కాకుండా ఇంకెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా కూడా ప్రకటించారు. ఇపుడు రిషి సునక్ అనూహ్యంగా వెనుకబడటంతో బ్రిటన్ ప్రధాని ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.