బ్రిటన్ యువరాజు తండ్రి అయ్యారు.. మేఘన్.. హ్యారీకి పండంటి బాబు పుట్టాడోచ్..
బ్రిటన్ యువరాజు తండ్రి అయ్యారు. బ్రిటన్ యువరాజు హ్యారీ, హాలీవుడ్ నటీమణి మేఘన్ మార్కెల్‌లకు గత ఏడాది మే నెల 19వ తేదీన అట్టహాసంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగింది.
ఈ నేపథ్యంలో హ్యారీ సతీమణి పండంటి బాబుకు జన్మనిచ్చిందని రాచ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. దీంతో బ్రిటన్ ప్యాలెస్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 5:26 గంటలకు మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు హ్యారీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
తన బిడ్డకు సంబంధించిన మరిన్ని విషయాలను రాబోయే రోజుల్లో షేర్ చేసుకుంటానని హ్యారీ పేర్కొన్నారు. ఇక హ్యారీ కుమారుడు బ్రిటన్ రాజ వంశంలో పుట్టిన ఏడో మగ వారసుడు. అంతేగాకుండా రెండవ రాణి ఎలిజెబెత్‌కు ఎనిమిదవ ముని మనవడు అవుతాడని రాజకుటుంబం వెల్లడించింది.