గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (08:40 IST)

అగ్నిప్రమాదం జరిగినా ఓపెన్ హార్ట్ సర్జరీ.. వైద్యుల పనితీరు అదుర్స్

అగ్నిప్రమాదం జరిగినా రష్యా వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఓవైపు ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్‌-హార్ట్‌ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్‌క్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  జార్‌ల కాలం నాటి ఇక్కడి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించిన కొద్దిసేపటికి మంటలు చెలరేగాయి. వైద్య సిబ్బంది ఏమాత్రం బెదిరిపోలేదు. 
 
అంతేగాకుండా రెండు గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసి రోగిని వేరేచోటుకు మార్చారు. ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురైన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. 
 
అదే సమయంలో ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ చేస్తున్న గదికి అన్నివిధాలుగా సంరక్షణ ఏర్పాట్లు చేశారు. లోపలికి పొగ వెళ్లకుండా పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదికి విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక కేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది వైద్యులు, నర్సులతో కూడిన బృందం సర్జరీలో పాల్గొంది.
 
ఈ ఆసుపత్రిని 1907లో నిర్మించారు. పైకప్పు చెక్కతో చేసింది కావడంతో నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ తెలిపింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆసుపత్రి నుంచి 128 మందిని ఖాళీ చేయించి సురక్షితంగా తరలించినట్లు తెలిపింది.