సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (16:14 IST)

డోనాల్డ్ ట్రంప్‌ సార్.. విరాళాలు తీసుకోవడం సిగ్గుగా లేదా : విద్యార్థిని ప్రశ్న

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఓ విద్యార్థిని నిలదీసింది. తన ఎన్నికల ప్రచారం కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్.ఆర్.ఏ) నుంచి డోనాల్డ్ ట్రంప్ భారీ మొత్తంలో విరాళాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఓ విద్యార్థిని నిలదీసింది. తన ఎన్నికల ప్రచారం కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్.ఆర్.ఏ) నుంచి డోనాల్డ్ ట్రంప్ భారీ మొత్తంలో విరాళాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఖండిస్తూ అమెరికాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లోరిడాలోని పార్క్‌లాండ్ హైస్కూల్‌ విద్యార్థులపై 17 ఏళ్ల నికోలస్ క్రూజ్ ఇటీవల విచక్షణారహితంగా కాల్పులు జరుపగా 17 మంది చిన్నారులు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ కాల్పులకు నిరసనగా భారీ ర్యాలీ జరిగింది. ఇందులో ఈ కాల్పుల నుంచి సురక్షితంగా బయటపడిన గొంజాలెజ్‌ అనే విద్యార్థిని ట్రంప్‌తో పాటు.. ఇతర రాజకీయ నేతలను ఉద్దేశించి ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. ఇది వైరల్‌గా మారింది. 
 
'ఎన్ఆర్ఏ నుండి విరాళాలు స్వీకరించే ప్రతి రాజకీయ నేతను చూసి సిగ్గుపడుతున్నాను' అంటూ ఆ బాలిక పేర్కొంది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం ఎన్ఆర్ఏ నుండి లక్షలాది డాలర్లు విరాళంగా తీసుకున్నారంటూ బాలికతో పాటు ర్యాలీలో పాల్గొన్న వారు తీవ్రంగా ఆరోపించారు. ఎన్ఆర్ఏ నుంచి రాజకీయ నేతలు విరాళాలు తీసుకోవడం 'సిగ్గు చేటు... సిగ్గుచేటు' అంటూ గొంజాలెజ్‌తో పాటు వారంతా శ్రుతి కలిపారు.
 
'ఒకవేళ అధ్యక్షుడు నా వద్దకు వస్తే జరిగిన కాల్పుల ఘటన గురించి ఆయన్ను నిలదీస్తా. ఎన్ఆర్ఏ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండంటూ ఆయన్ను ధైర్యంగా అడుగుతాను. అడగాల్సిన పని లేదు. అది ఎంతనేది నాకు తెలుసు. ఆ మొత్తం ముప్పై మిలియన్ డాలర్లు' అంటూ గొంజాలెజ్ ఎంతో తెగువతో చెప్పింది. ఇలా ట్రంప్‌పై ఆమె నిప్పులు చెరగడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా గొంజాలెజ్ గురించే చర్చించుకుంటున్నారు.