పాము పడకగదిలోకి వస్తే.. ఇంకేమైనా వుందా..?
పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది ఆ పాము పడకగదిలోకి వస్తే.. ఇంకేమైనా వుందా.. అంతే గుండె ఆగిపోతుంది. అలాంటి ఘటనే సింగపూరులో చోటుచేసుకుంది. పడక గదిలో నాగుపాము ఉందని, రక్షించండి అంటూ రెస్క్యూ టీమ్‌కు ఓ మహిళ ఫోన్ చేసిన వింత ఘటన సింగపూర్ దేశంలో వెలుగుచూసింది.
తన పడకగదిలో మంచం దగ్గర ఉన్న అల్మారాలో నాగుపాము ఉందని, పాము హిస్సింగ్ శబ్ధం వినిపిస్తుందని, దీన్ని రికార్డు చేసి పంపించి, తనను పాము బారి నుంచి కాపాడాలని కోరుతూ సింగపూర్ దేశానికి చెందిన జియాన్ అనే మహిళ రెస్క్యూ హాట్ లైన్‌కు ఏడుస్తూ ఫోన్ చేసింది.
సింగపూర్ రెస్క్యూ టీం ఆఫీసర్ ముహమ్మద్ సఫారీ బిన్ మస్నోర్ హుటాహుటిన మహిళ ఉన్న బెడ్రూంలోకి వచ్చి చూడగా బాత్రూంలో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఆన్ చేసి ఉండటం కనిపించింది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను స్విచ్ ఆఫ్ చేయడంతో పాములా వచ్చిన హిస్సింగ్ శబ్ధం ఆగిపోయింది.
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ నుంచి శబ్ధం పాము చేసే శబ్ధంలా అనిపించడంతో మహిళ నాగుపాము పడకగదిలో ఉందని భయపడి ఏడుస్తూ ఫోన్ చేసింది.బెడ్రూంలో నాగుపాము లేకపోవడంతో మహిళతో సహా రెస్క్యూ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.