గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (11:08 IST)

నిద్రలో నడుస్తూ 11వ అంతస్తు నుంచి కిందపడింది.. అయినా సరే...

సాధారణంగా మొదటి అంతస్తు నుంచి కింద పడితేనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటిది 11వ అంతస్తు నుంచి పడిపోతే... ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. కానీ, ఓ చిన్నారి నిద్రలో నడుస్తూ.. 11వ అంతస్తు నుంచి కింద జారిపడింది. అయినా క్షేమంగా బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి టూర్‌కు వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు. అయితే, దీచా కుమార్తెకు నిద్రలో నడిచే అలవాటుంది. దాంతో ఆమె నిద్రలో నడుస్తూ నేరుగా బాల్కనీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. 
 
కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో ఆ పాప గట్టిగా కేకలు పెట్టింది. హోటల్‌ సిబ్బంది వచ్చేసరికే ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు.